చ్చే నెల (నవంబర్)లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో 2011కు ముందు చేరిన టీచర్లకు టెట్ రాసేందుకు అవకాశం కల్పించాలా? వద్దా? అనే అంశంపై సందిగ్ధత..

ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబరు 1న తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి రెండేళ్లల్లో ఉత్తీర్ణులు కావాలని, పదోన్నతి పొందాలన్నా పాస్ కావాలని స్పష్టం చేసింది. అయితే ఐదేళ్లల్లో పదవీవిరమణ చేయబోయేవారికి మాత్రం టెట్ అర్హత అవసరం లేదని పేర్కొంది. కానీ వీరు కూడా పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాసవ్వాల్సిందేనని పేర్కొంది. ఈ నేపథ్యంలో నవంబరులో నిర్వహించే టెట్‌కు ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలా? వద్దా? అనేదానిపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ టీచర్లకు టెట్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తే జీఓలోనూ సవరణలు చేయాల్సి ఉంటుంది.
రివ్యూ పిటిషన్‌పై తర్జనభర్జనలు
మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే అంశంపై కూడా ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు రివ్యూ పిటిషన్ వేయాలని విద్యాశాఖ అధికారులకు వినతిపత్రాలు సైతం సమర్పించాయి. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 2011 నుంచి టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతకంటే ముందు డీఎస్సీ పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందిన టీచర్లకు టెట్ పరీక్ష లేదు. అయితే సుప్రీంకోర్టు వీరందరికీ రెండేళ్ల సమయం ఇచ్చి, ఆలోపు టెట్‌లో అర్హత సాధించాలని డెడ్‌లైన్ పెట్టింది. దీంతో రివ్యూ పిటిషన్ వేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని, టీచర్లంతా పరీక్ష రాయవల్సిందేనని మరికొందరు ఉపాధ్యాయులు అంటున్నారు. 2011కు ముందు చేరిన టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.