తుఫాను హెచ్చరిక.. వచ్చే 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తూర్పు గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

 


అమరావతి, అక్టోబర్ 20: దక్షిణ అండమాన్ సముద్రము మరియు దాని సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తదుపరి 24 గంటలలో అల్పపపీడనం వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత ఇది పశ్చిమ, వాయువ్య దిశలో కదిలి, బలపడి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతం, దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అక్టోబర్‌ 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


ప్రస్తుతం తూర్పు గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావం పెరిగే కొద్దీ వర్షాల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు (సోమవారం) బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయి.

ఇక మంగళవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయి. బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, కృష్ణా, పల్నాడు, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అక్టోబర్‌ 23న కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

తెలంగాణలో నేటి వాతావరణం ఇలా..

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ కేంద్ర ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.